రాయలసీమ న్యూస్, అనంతపురం: రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు భారీ పెట్టుబడులు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో జిల్లాకు సంబంధించిన పలు పరిశ్రమల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు మండలంలో న్టీపీసీ రెనెహ్వాల్ ఎనర్జీ ప్లాంట్ స్థాపనకు సీపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం చెన్నంపల్లి, కంబదూరు గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల పెట్టుబడి రానుండగా, 750 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
అనంతపురం జిల్లాలో స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమ స్థాపనకు కూడా సమావేశంలో గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ సంస్థ రూ.46.83 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, దాదాపు 300 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కూడా పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించింది.
కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రంలో సార్ల ఏవియేషన్ సంస్థ పెట్టుబడులకు సీపీబీ సమ్మతి తెలిపింది. ఈ సంస్థ రూ.330 కోట్లు మదుపు చేయనుండగా, సుమారు 40 మందికి ఉద్యోగాలు కలుగనున్నాయి. విమానయాన రంగానికి అనుబంధంగా ఈ పెట్టుబడులు జిల్లాలో కొత్త అవకాశాలకు దారితీయనున్నాయని భావిస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో బెర్గెర్ పైంత్స్ సంస్థ ప్లాంట్ స్థాపనకు కూడా ఆమోదం లభించింది. ఈ సంస్థ రూ.176.82 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, జిల్లాలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత చురుకుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం గా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం పొందిన పెట్టుబడుల విలువ రూ.6,553.63 కోట్లకు చేరుకుంది. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పించే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
పెట్టుబడుల ఆమోదంతో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పారిశ్రామిక వాతావరణం మరింత మెరుగుపడే అవకాశం ఉందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.













