అనంతపురం నగరంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. కార్యాలయ పనితీరు, పన్నుల వసూళ్ల విధానంపై కలెక్టర్ సమగ్రంగా సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు తాజా పన్నుల విధానాలు, సాంకేతిక వినియోగంపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు.

ఏఐ ఆధారిత పన్నుల విధానం అమలు పరిస్థితులను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కలెక్టర్ ఆనంద్‌కు వివరించారు. పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, శాఖ పనితీరును పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సిటిడి నెక్స్ట్ జెన్ పోర్టల్ , AP పనితీరును కూడా ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు ప్రదర్శించారు. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సేవలు, వినియోగ విధానం, ఇప్పటివరకు నమోదైన స్పందనపై వివరంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ఈ సిటిడి నెక్స్ట్ జనరేషన్ పోర్టల్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖ పనితీరు, పన్ను చెల్లింపుదారులకు అందించే సేవలు మరింత సులభతరమయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, తనిఖీలు, బకాయిల వసూళ్లు వంటి కీలక కార్యకలాపాలను ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే విధానాన్ని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

పన్ను చెల్లింపుదారులు కార్యాలయాలకు పలుమార్లు రావాల్సిన అవసరం తగ్గి, ఎక్కువ భాగం సేవలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అనుమతుల మంజూరు, బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతమైందని వివరించారు.

కలెక్టర్ ఆనంద్ కార్యాలయ విభాగాలను పరిశీలించి, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, సేవల అందుబాటు పరిస్థితులను తెలుసుకున్నారు. పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యం కల్పించేలా సేవలను విస్తరించాలనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.