రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం: అనంతపురం నగరంలోని చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఓల్డ్ టౌన్‌లోని విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్ వద్ద ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ వాక్, నగరంలోని పలు చారిత్రక నిర్మాణాల మీదుగా సాగింది.
విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్ నుంచి మొదలైన వాక్ బృందం, చెన్నకేశవ స్వామి దేవాలయం, నెంబర్ వన్ స్కూల్, విరూపాక్ష దేవాలయం, జామియా మసీదు, బసవన్న కట్ట మార్గంగా ప్రయాణించింది. అనంతరం సప్తగిరి సర్కిల్ సమీపంలోని ఐరన్ బ్రిడ్జి వద్ద కార్యక్రమం ముగిసింది. ఈ మార్గంలో ఉన్న కట్టడాల చరిత్ర, నిర్మాణ ప్రత్యేకతల గురించి పాల్గొన్న వారికి అధికారులు వివరించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్‌తో పాటు హెరిటేజ్‌పై ఆసక్తి ఉన్న సుమారు 50 మంది పాల్గొన్నారు. ఆన్లైన్లో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకున్న వారిని ఈ వాక్‌లో భాగస్వాములుగా చేసుకున్నారు. వాక్ సందర్భంగా అధికారులు, నిపుణులు కలిసి నగర వారసత్వంపై వివరణాత్మకంగా తెలియజేశారు.
అనంతపురం నగరంలో సుమారు 30 నుంచి 35 వరకు హెరిటేజ్ భవనాలను గుర్తించాం. వాటి చరిత్ర, ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తొలిసారిగా హెరిటేజ్ వాక్ నిర్వహించాం.
అనంతపురం నగరంలో ఉన్న హెరిటేజ్ భవనాల జాబితాను సిద్ధం చేసి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. చరిత్ర, వారసత్వ కట్టడాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ భవిష్యత్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న సుమారు 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చరిత్ర, వారసత్వ కట్టడాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ భవిష్యత్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. హెరిటేజ్ భవనాలు, చారిత్రక కట్టడాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెరిగితే వాటి పరిరక్షణకు మరింత అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తాం.
హెరిటేజ్ వాక్ ద్వారా నగరంలోని పాత కట్టడాల విలువ, వాటి సామాజిక, సాంస్కృతిక నేపథ్యం గురించి యువతకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే చారిత్రక నిర్మాణాల సంరక్షణ సాధ్యమని, ఇందుకోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని జిల్లా పరిపాలన స్పష్టం చేసింది.













