రాయలసీమ న్యూస్, అనంతపురం:
అనంతపురం రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం:తప్పించుకున్న ప్రయాణికుడు
అనంతపురం: అనంతపురం రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు వేలాడుతున్న ఓ ప్రయాణికుడిని ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సి. సురేంద్రను జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ అభినందించి ఘనంగా సన్మానించారు. గత నెల 29న ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి బందోబస్తు విధులకు వెళ్తున్న ట్రాఫిక్ ఎస్ఐ రామాంజుల రెడ్డిని రైలు ఎక్కించేందుకు కానిస్టేబుల్ సురేంద్ర, హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ కలిసి అనంతపురం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఎస్ఐని రైలు ఎక్కించిన అనంతరం ప్లాట్‌ఫామ్ నంబర్ 4పై నడుచుకుంటూ వస్తుండగా, భైరవనగర్‌కు చెందిన 49 ఏళ్ల రవికుమార్ కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రవికుమార్ పట్టు జారి, ఒక చేతితో హ్యాండిల్ పట్టుకుని రైలు నుంచి వేలాడుతూ కనిపించాడు. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కానిస్టేబుల్ సురేంద్ర వెంటనే అప్రమత్తమయ్యారు. పరిగెత్తుకుంటూ వెళ్లి రవికుమార్‌ను గట్టిగా పట్టుకుని ప్లాట్‌ఫామ్‌పైకి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. రవికుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు.
తన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సురేంద్రకు రవికుమార్ కంటతడి పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సురేంద్రే తన పాలిట దేవుడని పేర్కొంటూ ఆయన పాదాలకు నమస్కరించాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కానిస్టేబుల్ సాహసాన్ని అభినందించారు.
కానిస్టేబుల్ సురేంద్ర ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆయనను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీసుల ప్రాథమిక విధి అని, సురేంద్ర చూపిన చొరవ పోలీసు శాఖకే గర్వకారణమని ఎస్పీ పేర్కొన్నారు.
అనంతరం జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున ఎస్పీ పి. జగదీష్ చేతుల మీదుగా కానిస్టేబుల్ సురేంద్రను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్, ఆర్‌ఐ పవన్ కుమార్, ట్రాఫిక్ ఎస్‌ఐ రాంభూపాల్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సూర్యకుమార్, గాండ్ల హరినాథ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.













