రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి నుంచి అనంతపురం వైపు వస్తున్న టాటా సఫారీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న షెడ్‌ను ఢీకొట్టి, అక్కడి హోటల్‌లోకి దూసుకెళ్లినట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదం సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగింది. కారులో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్‌కు చెందిన శ్రీధర్ రెడ్డి, సింగనమల మండలం సలకం చెరువు గ్రామానికి చెందిన కుమార్, గుత్తికి చెందిన హరితతో పాటు మరో యువతి కారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రోటరీపురం వద్దకు చేరుకున్న సమయంలో కారు వేగంగా వచ్చి అదుపుతప్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ముందుగా రోడ్డు పక్కన ఉన్న షెడ్‌ను ఢీకొట్టిన కారు, ఆ తర్వాత అక్కడి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఢీకొన్న ప్రభావంతో గుత్తికి చెందిన హరిత అనే యువతి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కారులో ఉన్న మరో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్య వర్గాలు ప్రాథమికంగా తెలియజేశాయి. ఇద్దరు యువకులు కూడా గాయాలతో బయటపడ్డారు. గాయపడిన ముగ్గురిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై, పోలీసులకు సమాచారం అందించారు. బుక్కరాయసముద్రం పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల నిజమైన కారణాలు ఏమిటి, కారు వేగం ఎంత, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడా వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.













