రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం:- జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే రోగులకు మందుల కొరత నిరాశ కలిగిస్తోంది. వైద్య సేవలు, పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ, వైద్యులు రాసిచ్చే మందులు పూర్తిస్థాయిలో లభించకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట నుంచి మందులు కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాలెమ్మ అనే మహిళ మధుమేహం, ఆయాసం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. ఆమె జీజీహెచ్‌లోని వైద్యులను సంప్రదించగా, అయిదు రకాల మందులు రాసిచ్చారు. అయితే పంపిణీ కేంద్రంలో ఒక రకం మందు లేనందున నాలుగు రకాల మందులనే ఇచ్చారు. మందులు ఎలా వాడాలో సిబ్బంది వివరించినా, తనకు పూర్తిగా అర్థం కాలేదని, వాటిని పట్టుకుని తిరుగుతున్నానని లాలెమ్మ తెలిపింది. ఎప్పుడు ఏ మాత్ర వేసుకోవాలో స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక కవర్లలో పెట్టి ఇస్తే, తనలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడుతోంది.
అనంతపురం నగరం సిండికేట్‌నగర్‌కు చెందిన గోపాల్ మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయన, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వైద్య విభాగం ఓపీలో వైద్యుడిని సంప్రదించారు. సమస్యను వివరించగా, వైద్యుడు మూడు రకాల మందులు 15 మాత్రలు చొప్పున రాసిచ్చారు. అయితే పంపిణీ కేంద్రంలోని సిబ్బంది రెండు రకాల మందులనే ఇచ్చి, Clonazepam మందులు లేవని, బయట కొనుగోలు చేయాలని సూచించారు. ఉచితంగా మందులు పొందేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే, ఇక్కడ కూడా లేవంటే ఎలా అని గోపాల్ వాపోయారు.
జీజీహెచ్, Super Speciality వైద్యశాలలో సేవలు పొందేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వస్తున్నారు. రోజూ ఇన్‌పేషంట్లు సుమారు 1200 మంది వరకు ఉండగా, ఓపీ 2,500 నుంచి 3,000 వరకు నమోదవుతోంది. ఈ స్థాయిలో రోగులు వస్తున్న కీలక విభాగాల్లో తీవ్రమైన సమస్యలకు సంబంధించిన మందులు పూర్తిస్థాయిలో లేకపోవడం రోగులకు పెద్ద ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు.
మానసిక వైద్య విభాగం, కార్డియాలజీ , యూరాలజీ , నెఫ్రోలోజి , డెర్మటాలజీ , ఎండోక్రైనాలజీ , గాస్ట్రోఎంటరోలాజి వంటి కీలక విభాగాలకు సంబంధించిన అనేక మందులు ప్రస్తుతం అందుబాటులో లేవని రోగులు పేర్కొంటున్నారు. చర్మ వ్యాధుల విభాగానికి సంబంధించిన పేర్మత్రిం , బేతమేతసోనే , ఫుసిడిక్ ఆయింట్మెంట్ లు లేవు. వీటి ధర ప్రైవేటు మెడికల్ షాపుల్లో సగటున రూ.150 నుంచి రూ.200 వరకు ఉండటంతో పేద రోగులకు అదనపు భారంగా మారుతోంది. గుండె సంబంధిత చికిత్సలో ఉపయోగించే దాపగలైఫ్లోజిన్ , యేసునొకమారోల్ , ఒరిసిప్రేనళినే , త్రినేతాజిడినే , ప్రసుగ్రిల్ , ఇసోసోర్బిడ్ , ఆటోర్వాస్టాటిన్ 40mg వంటి మందులు కూడా లభ్యం కావడం లేదని రోగులు తెలిపారు. ఇతర విభాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని వారు అంటున్నారు.
వైద్యులు రాసిచ్చే మందులన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. కొన్ని సరఫరా లేకపోవడంతో Local Purchase కింద కొనుగోలుకు indent పెట్టాం. అందుబాటులో లేనివాటికి సరైన ప్రత్యామ్నాయాలను ఇస్తున్నాం. దాతల సహకారంతో ప్రత్యేక కవర్లు ఏర్పాటు చేసేలా చూస్తాం.
అని గవర్నమెంట్ సర్వజన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.













