నేటి నుంచి గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గూగూడు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనంతో ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

గూగూడు క్షేత్రంలో కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి జంట దేవాలయాలు పక్కపక్కనే ఉండటం ప్రత్యేకత. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రంలో హిందూ, ముస్లిం సోదరులు కలిసి పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్థానికంగా విశేషంగా భావిస్తారు. రాయలసీమ ప్రాంతంలో మొహర్రం బ్రహ్మోత్సవాల కోసం గూగూడు క్షేత్రం అత్యంత ప్రసిద్ధి చెందింది.

ఉత్సవాల షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 17న కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 18న నిత్యపూజ, నివేదన నిర్వహిస్తారు. 19న అగ్నిగుండం ఏర్పాటు, 20న కుళ్లాయిస్వామి పీర్లు నిలుపుట జరుగుతుంది. 21, 23 తేదీల్లో నిత్యపూజ, నివేదన కొనసాగుతుంది. 22న ఐదో సరిగెత్తు, 24న చిన్నసరిగెత్తు నిర్వహించనున్నారు.

జూన్‌ 25న విడిదినం పాటించగా, 26న పెద్దసరిగెత్తు, రాత్రికి గామోత్సవం నిర్వహిస్తారు. 27న పీర్లు అగ్నిగుండ ప్రవేశం, అనంతరం జలధికి పయనం కార్యక్రమాలు ఉంటాయి. 29న కుళ్లాయిస్వామి చివరి దర్శనంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో గ్రామం, పరిసర ప్రాంతాల్లో భద్రత, రవాణా, పారిశుద్ధ్య ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపడుతున్నాయి.

ఆని ఆలయ కమిటీ ఛైర్మన్‌ నాగార్జున తెలిపారు. స్థానిక గ్రామస్తులు, సేవా సంఘాలు, స్వచ్ఛంద సేవకులు కలిసి ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. భక్తులు నియమ నిష్ఠలతో, క్రమశిక్షణతో ఉత్సవాల్లో పాల్గొనాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.