అనంతపురం: జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన కీలక సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమం చేపట్టనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ‘కోరికల దినం’ నిర్వహించనున్న నేపథ్యంలో అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో APUWJ ఆధ్వర్యంలో ‘కోరికల దినం’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐ.వి. సుబ్బారావు వెల్లడించారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ల మంజూరులో కూటమి ప్రభుత్వం మంచి పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. అయితే జర్నలిస్టుల సమస్యల్లో ఇంకా అనేక అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల ఆక్సిడెంటల్ పాలసీని వెంటనే పునరుద్ధరించాలని, హెల్త్ స్కీమ్ అమలులో ఉన్న లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని APUWJ డిమాండ్ చేసింది. జర్నలిస్టుల కోసం హౌసింగ్ స్కీమ్‌ను తక్షణం అమలు చేయడంతో పాటు రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఐ.వి. సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐ&పీఆర్ మంత్రి పార్థసారథి జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలులో జాప్యం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అత్యవసరమని APUWJ భావిస్తోంది.

అక్టోబర్ 2వ తేదీ నుంచి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఉద్యమం ప్రారంభించనున్నట్లు ఐ.వి. సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, నంద్యాలలో ఐన్యూస్ జర్నలిస్టుల అరెస్ట్‌ను APUWJ తీవ్రంగా ఖండించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం బాధాకరమని ఐ.వి. సుబ్బారావు పేర్కొన్నారు. వార్తపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఖండన తెలియజేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించాల్సిందిగా సూచించారు.

జర్నలిస్టులను అర్ధరాత్రి, తెల్లవారుజామున వారి ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారంపై Director General of Police (DGP) వెంటనే జోక్యం చేసుకోవాలని APUWJ డిమాండ్ చేసింది. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని ఐ.వి. సుబ్బారావు కోరారు.

ఈ సమావేశంలో APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు, జిల్లా గౌరవ అధ్యక్షులు భోగేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.