రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం: ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)లో సివిల్ కానిస్టేబుళ్ల SCTPCs 2025-26 బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. పరేడ్‌లో పాల్గొన్న కొత్త కానిస్టేబుళ్లను మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఖాకీ యూనిఫామ్ అధికారంతో పాటు ఎంతో బాధ్యతను కూడా ఇస్తుందని తెలిపారు. రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులే ప్రభుత్వానికి ప్రజల్లో కనిపించే ప్రతినిధులని చెప్పారు. పోలీసులు విధులు నిర్వహించే విధానంపైనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు.
ఇతర ఉద్యోగాలకు పని వేళలు ఉంటాయని, పోలీసులకు మాత్రం కేవలం బాధ్యత మాత్రమే ఉంటుందని మంత్రి వివరించారు. ప్రమాదాలను సైతం ఎదుర్కొని విధులు నిర్వహించేది పోలీసులేనని ఆయన తెలిపారు. పోలీసులు రక్షణగా నిలుస్తూ కాపలా కాస్తున్నందువల్లే ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటూ హాయిగా నిద్రపోతున్నారని చెప్పారు.
పోలీసుల త్యాగాలతో పాటు వారి కుటుంబాల త్యాగాలను కూడా గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి యూనిఫామ్ వెనుక ఒక మంచి పోలీసు ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులను చూసి ప్రజలు భయపడకూడదని, రౌడీలు, నేరస్థులు మాత్రం భయపడేలా పోలీసులు పనిచేయాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం పోలీసింగ్ విధానం పూర్తిగా మారిందని, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతేనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని చెప్పారు.
మానవత్వంతో, బాధ్యతతో విధులు నిర్వహిస్తూ బాధితులకు నమ్మకం కల్పించేలా పనిచేయాలని కొత్త కానిస్టేబుళ్లకు మంత్రి సూచించారు. తమను ఈ స్థాయికి తీసుకురావడానికి కష్టపడిన తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దని అన్నారు. అనంతపురం నుంచి రాష్ట్రంలోనే అతిపెద్ద బ్యాచ్ పాసింగ్ ఔట్ అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లు అందరూ గర్వపడేలా పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు, ట్రైనింగ్ కాలేజీ బోధకులు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.













