నారాయణపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆరోగ్య సేవలకు మరింత బలం చేకూర్చే దిశగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి పునాది పడింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో నారాయణపురంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణం జరగనుంది. ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద సుమారు 42 లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు నారాయణపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు హాజరయ్యారు.

భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నారాయణపురం ప్రాంతంలో ప్రస్తుత ఆరోగ్య సదుపాయాల పరిస్థితిని వివరించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ పనిచేసే సిబ్బంది, వైద్యులు, సేవలు పొందే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ చిన్న అవసరం వచ్చినా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్పారు.

“ఈ సమస్యకు తాము పరిష్కారం చూపించాం. రెండేళ్ల పాలనలో తాము చేసిన పనులను 80 వేల ఇళ్లకు వెళ్లి వివరించాం. అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పన కూడా జరుగుతోంది. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1296 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం” అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

జిల్లాలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమతుల్యంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎల్.నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై మాట్లాడారు. ఎల్.నినో కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా తగినంతగా తాగునీటిని నిల్వ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

“రైతులెవరు వరి, మిర్చి లాంటి పంటలు వేయవద్దు” అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.