రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నారాయణపురంలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 42 లక్షల రూపాయల వ్యయంతో గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భూమి పూజ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడారు. నారాయణపురం ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ సిబ్బంది, వైద్యులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు.
ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు కొత్త గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. రెండేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను 80 వేల ఇళ్లకు వెళ్లి ప్రజలకు తెలియజేశామని చెప్పారు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాకు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, అదే స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,296 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు దగ్గుపాటి ప్రసాద్ వివరించారు. ఆరోగ్య రంగంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎల్.నినో ప్రభావంపై ప్రభుత్వం ముందుగానే అంచనా వేసి, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా తాగునీటి నిల్వలను ముందస్తుగా తగినంతగా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి, మిర్చి వంటి పంటలు వేయకూడదని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నడిపిస్తున్నారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. నారాయణపురంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం ప్రారంభం స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదం చేయనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.













