ఉద్యానశాఖ కార్యాలయ ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు..

ఉద్యోగుల ఆవేదన

అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ రైతు బజారు ముందు భాగంలో ఉన్న జిల్లా ఉద్యానశాఖ కార్యాలయం పరిసరాలు ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి. అదే ఆవరణలో సూక్ష్మ సాగునీటి పథక సంచాలకుల కార్యాలయం, ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రం, పక్కనే అనంతపురం మండల వ్యవసాయాధికారి కార్యాలయం ఉన్నాయి. ఈ కార్యాలయాలన్నీ ఒకే కాంపౌండ్‌లో ఉండగా, అక్కడే కొనసాగుతున్న చేపల మార్కెట్ కారణంగా సిబ్బంది తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.

జిల్లా ఉద్యానశాఖ కార్యాలయం మెట్ల కింద భాగానికి ఆనుకుని చేపల మార్కెట్ ఉండటం, మార్కెట్‌కు ప్రధాన రహదారివైపు ద్వారం ఉన్నప్పటికీ కార్యాలయం వైపు కూడా తలుపులు, గ్రిల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల సమస్యలు మరింత పెరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు. మార్కెట్ నిర్వాహకులు ఫ్లెక్సీలు తగలించుకోవడంతో పాటు కార్యాలయ ఆవరణను తమ సౌకర్యానికనుగుణంగా వినియోగించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

సాయంత్రం కార్యాలయాలు మూసివేసి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఆవరణలో కుర్చీలు వేసుకుని మద్యం సేవించడం, సెలవు దినాల్లో గేట్ల తాళాలు తీసేసి అసాంఘిక కార్యకలాపాలకు ఆవరణను వేదికగా మార్చుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మద్యం సీసాలు తాగేసి ఆవరణలోనే పడేయడం, కుండీలు పగలగొట్టడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని సమాచారం.

అదే ఆవరణలో ఉన్న అనంతపురం మండల వ్యవసాయాధికారి కార్యాలయం వెనుక భాగంలో కొన్నేళ్లుగా చేపల పెట్టెలను పడేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ గదుల కిటికీలు, తలుపులు తెరిచిన వెంటనే చేపల దుర్వాసనతో కూర్చోలేని పరిస్థితి నెలకొంటోందని వారు చెబుతున్నారు. పని వాతావరణం పూర్తిగా దెబ్బతింటోందని, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చేపల మార్కెట్‌ను ప్రస్తుత స్థలం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని, కార్యాలయ ఆవరణను శుభ్రంగా, సురక్షితంగా ఉంచేలా అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలని ఉద్యోగులంతా కలెక్టర్ ఆనంద్‌ను కోరుతున్నారు. సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.