పామిడి మండలంలోని అప్పాజీపేట గ్రామంలో వారం రోజులుగా చోటుచేసుకుంటున్న వింత ఘటన గ్రామస్తుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. రాత్రి వేళల్లో మనుషుల అడుగు దూరంలో రాళ్లు పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట కలిగిస్తున్నా, రాళ్లు ఎలా.. ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది మాత్రం మిస్టరీగా మారింది.

గుట్టకింద వెలసిన అప్పాజీపేట గ్రామంలో సుమారు 270 ఇళ్లు ఉన్నాయి. 600 మంది ఓటర్లు, 800 మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఎక్కువమంది వ్యవసాయం, కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న ఈ గ్రామంలో వారం క్రితం నుంచి అలజడి మొదలైంది. చీకటి పడగానే రాళ్లు పడుతున్నాయన్న సమాచారం గ్రామమంతా పాకింది.

తొలిరోజు గ్రామంలో వెంకటన్న ఇంటి వరండాలో రాళ్లు పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తరువాత గ్రామ గుట్ట పక్కన ఉన్న పీర్లచావిడి, పెద్దమ్మ గుడి మధ్యనున్న సందులో కూడా రాళ్లు కనిపించాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గుట్టను, పరిసరాలను పరిశీలించారు. అయితే వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. గుట్టపై ఉన్న రాళ్లు గ్రామంలోకి వచ్చి ఎలా పడుతున్నాయన్నది గుర్తించలేక పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై గ్రామంలో వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చితంబరస్వామి శాపం ప్రభావమే ఇప్పుడు కనిపిస్తున్నదని కొందరు గ్రామస్తులు ప్రచారం చేస్తున్నారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన చితంబరస్వామి సనాతన బ్రాహ్మణుడు. అతని చర్యలు గ్రామంలోని బ్రాహ్మణులకు నచ్చకపోవడంతో, అతడిని గ్రామంలోకి రానీయలేదని గ్రామస్తుల వాదన. దీనిని అవమానంగా భావించిన చితంబరస్వామి, గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలు ఒక్కొక్కటిగా పూర్తిగా హరించుకుపోతాయని, గుట్ట నుంచి రాళ్లు ఎగిసి పడతాయని శపించాడని కథ చెబుతున్నారు.

ప్రస్తుతం అప్పాజీపేటలో ఒక్క బ్రాహ్మణ కుటుంబం కూడా లేకపోవడం, ఇతర సామాజిక వర్గాల ప్రజలే నివసించడం ఈ కథకు బలం చేకూరుస్తోందని కొందరు భావిస్తున్నారు. చితంబరస్వామి శాపం భాగంగానే ఇప్పుడు రాళ్లు ఎగిరి పడుతున్నాయని కొంతమంది గ్రామస్తులు నమ్ముతున్నారు.

మరోవైపు, గ్రామంలోని 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల కొందరు యువకుల ఆకతాయితనమే ఈ రాళ్ల వర్షానికి కారణమై ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది. యువత గుంపుగా చేరి రాత్రివేళ రాళ్లు విసిరి, తర్వాత జనంతో కలిసిపోతున్నారన్న అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు నియోజకవర్గ ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన యువత కావడంతో, వారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి గ్రామస్తులు వెనకాడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నెల 8న గ్రామంలోని వన్నూరుస్వామి ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ప్రతి గురువారం గ్రామానికి చెందిన వడ్డే దాసన్నకు వన్నూరుస్వామి ఆవహించి, భక్తుల సమస్యలను పరిష్కరిస్తాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ రోజు వన్నూరుస్వామికి చక్కెర చదివించి, కోర్కెలు, సమస్యలను తెలియజేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో 8న రాళ్లు ఎగిరి పడే ఘటనపై స్వామికి వివరించి, వడ్డే దాసన్న ద్వారా పరిష్కారం కోరాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.

ఏది ఏమైనా, రాత్రివేళ మనుషుల పక్కనే పడుతున్న రాళ్ల వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. చితంబరస్వామి శాపమా, ఆకతాయిల పనా అన్న సందేహాల మధ్య అప్పాజీపేట గ్రామం భయంతో, అనుమానాలతో రోజులు గడుపుతోంది. ఈ వింత ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిజానిజాలు అధికారులు తేల్చాల్సి ఉంది.