అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న నాలుగు దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.12.50 లక్షల విలువైన దొంగసొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణపేట ఎదురుగా ఉన్న మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న నల్లబోతుల వాసు (24) రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుత్తి ఆర్‌ఎస్‌లోని రైల్వే క్వార్టర్స్ వాటర్ ట్యాంక్ వద్ద వాసును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

నిందితుడి వద్ద నుంచి సుమారు 60 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాలు, రూ.3,45,600 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం దొంగసొత్తు విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

నిందితుడు నల్లబోతుల వాసుపై గతంలో అనంతపురం, గుంతకల్లు, కసాపురం పోలీస్ స్టేషన్లలో మొత్తం ఆరు కేసులు నమోదై ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. పాత కేసులతో పాటు తాజా నాలుగు దొంగతనం కేసుల్లోనూ అతని ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడినట్టు తెలిపారు.

అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గుంతకల్లు ఎస్‌డీపీఓ ఏ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుత్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రామారావు, ఎస్‌ఐలు కె. సురేష్, డి. అమీర్ ఖాన్ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసుల దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.