రాయలసీమ న్యూస్, అనంతపురం:
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివే అరుదైన అవకాశం గుంతకల్లు విద్యార్థినికి
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన విద్యార్థినికి విదేశీ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదివే అరుదైన అవకాశం లభించింది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినందుకు ఆమెకు ఈ అవకాశం దక్కింది.
వివరాల్లోకి వెళ్తే.. గతేడాది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తన పరిధిలోని నాలుగు విద్యాలయాల యువ విద్యార్థులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో భాగంగా లండన్ యూనివర్సిటీ అధికారులు గుంతకల్లు పట్టణానికి చెందిన అనీశ్ ఫాతిమాతో పాటు మరో 12 మంది విద్యార్థులను లండన్‌కు పిలిపించి అక్కడ ప్రత్యేక పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షల్లో మన దేశం నుంచి అనీశ్ ఫాతిమా, ముంబయికి చెందిన మరో విద్యార్థి తమ ప్రతిభను చాటుకున్నారు. వీరిద్దరూ పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మూడు సంవత్సరాల బీటెక్ కోర్సులో భాగంగా కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్ విభాగాల్లో చదివే అవకాశం పొందారు.
అదనంగా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన లైసెన్సును కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ఇద్దరు విద్యార్థులకు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సీఈవో హెర్రీ హార్ధిన్ స్వయంగా హాజరై అనీశ్ ఫాతిమాకు ధ్రువపత్రాన్ని అందజేశారు. అంతర్జాతీయ వేదికపై స్థానిక విద్యార్థిని సాధించిన ఈ విజయంతో గుంతకల్లు పట్టణంలో ఆనందం వ్యక్తమవుతోంది.
అనీశ్ ఫాతిమా విద్యాభ్యాసం విషయానికొస్తే.. ఆమె గుంతకల్లు కేంద్రీయ విద్యాలయంలో మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. అనంతరం ఇంటర్‌మీడియట్‌ను గుత్తి కేంద్రీయ విద్యాలయంలో పూర్తి చేసింది. చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ, సైన్స్ రంగంపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అనీశ్ ఫాతిమా తల్లి షానవాజ్ బేగం ఉరవకొండ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా, తండ్రి జకీర్ హుసేన్ పెద్దపప్పూరు జూనియర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కూతురు సాధించిన ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ఎంపిక కావడం స్థానిక విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.













