గుత్తి మండలం శ్రీపురం (కొజ్జేపల్లి) గ్రామ చెరువులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐ.ఏ.యస్. ప్రారంభించారు. సూపర్ ఎల్.నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చెరువు గర్భంలో పశుగ్రాసం సాగు చేపట్టడం ద్వారా పశువులకు ఆహార భద్రతను కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. చెరువులలో ఖాళీగా ఉన్న విస్తీర్ణాన్ని వినియోగించి పశుగ్రాసం పంటలను సాగు చేయడం ద్వారా ఎండకాలంలో పశువులకు మేత కొరత సమస్యను తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసం సాగు కోసం మొత్తం 297 ఎకరాల విస్తీర్ణానికి అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ఇందులో ఇప్పటివరకు 249 ఎకరాల్లో విత్తనాలు చల్లడం పూర్తయిందని, మిగిలిన విస్తీర్ణంలో కూడా త్వరలోనే విత్తనాలు చల్లి పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

సూపర్ ఎల్.నినో ప్రభావంతో వర్షపాతం లోపం, ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. చెరువులలో పశుగ్రాసం సాగు ద్వారా నీటి లభ్యత ఉన్న సమయంలోనే పంటను పెంచి, తరువాత కోసి నిల్వచేసి అవసరమైనప్పుడు పశువులకు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు పశుగ్రాసం విత్తనాలు, సాంకేతిక సూచనలు అందజేస్తున్నట్లు, చెరువుల వినియోగంపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా మొత్తం పశుసంపదకు మేత భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.