రాయలసీమ న్యూస్, అనంతపురం: గుంతకల్లు: వజ్రకరూరు నుంచి దోనముక్కల వరకు నిర్మిస్తున్న 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్‌కు సంబంధించి విద్యుత్ టవర్ల ఏర్పాటుతో కలిగే నష్టపరిహారం అంశంపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణ పనులు ACME ఉర్జా వన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
దోనముక్కల పరిధిలో 12 టవర్ల నిర్మాణం ఇంకా పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం కంటే అధిక నష్టపరిహారం ఇవ్వాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఓ. ఆనంద్ రైతులు, కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి విస్తృతంగా చర్చలు జరిపారు.
సమావేశంలో అధికారులు టవర్ల స్థాపనకు ప్రతిపాదించిన భూముల వివరాలు, అక్కడి భూవిలువలు, సాగు పరిస్థితులు, పంటల స్థితిగతులు, ఇప్పటివరకు చెల్లించిన నష్టపరిహారం వంటి అంశాలను కలెక్టర్‌కు వివరించారు. రైతులు తమ సమస్యలను, భూములపై టవర్లు ఏర్పాటుతో కలిగే ప్రభావాన్ని వివరంగా తెలియజేశారు. కంపెనీ ప్రతినిధులు ప్రాజెక్టు పురోగతి, ఆలస్యానికి కారణాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై సమాచారం అందించారు.
కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రభుత్వ నిబంధనలతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. టవర్లు ఏర్పాటు చేయబోయే భూములు గ్రామాల ఔట్‌సైట్స్ పరిధిలో ఉన్నాయా, జాతీయ రహదారి సమీపంలో ఉన్నాయా, పంటలకు ఎంత మేర నష్టం జరుగుతోందో వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగానే తుది పరిహారం రేట్లు నిర్ణయిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆయన ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత రైతుల అభ్యంతరాలు, కంపెనీ అభిప్రాయాలు, ప్రభుత్వ మార్గదర్శకాలను సమన్వయం చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో గుంతకల్లు ఆర్డీఓ ఏబీవీఎస్బీ శ్రీనివాస్, ఇంచార్జి తహసీల్దార్ పుణ్యవతి, వ్యవసాయ శాఖ అధికారులు, సబ్-రిజిస్ట్రార్, ACME ఉర్జా వన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.













