కళ్యాణదుర్గం: ఆంధ్ర అరుణాచలంగా పేరొందిన కుందుర్పి కొండ గిరి ప్రదక్షిణ, పర్యావరణ పరిరక్షణ–మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. గిరి ప్రదక్షిణను భక్తి కార్యక్రమంగా మాత్రమే కాకుండా, ప్రకృతి సంరక్షణకు దోహదపడే విధంగా మలచడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

“కేవలం గిరి ప్రదక్షిణ కాదు.. చేతిలో ఒక మొక్కను తీసుకుని ప్రదక్షిణ చేసి, అనంతరం ఆ మొక్కను నాటాలి”

అని ఆయన చెప్పిన వినూత్న కార్యక్రమంలో భక్తులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

భక్తి భావనతో పాటు ప్రకృతి పరిరక్షణను కలగలిపిన ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచవచ్చని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున, Discovery Channel అనిల్, బీజేపీ తాలూకా కో–కన్వీనర్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు తాహిర్, మార్కెట్ యార్డు డైరెక్టర్ వై.బి. ఓభయ్య, టీడీపీ మాజీ బూత్ కన్వీనర్ గొల్లపల్లి ప్రసాద్, ఎర్రగుంట ఆనంద్, అమరావతి నారప్ప, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు మహేష్, ఐటీడీపీ కో–కన్వీనర్ మఠం అనిల్ తదితరులు పాల్గొన్నారు.

కుందుర్పి మండల ప్రజలు, స్థానిక నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గిరి ప్రదక్షిణతో పాటు మొక్కల నాటే కార్యక్రమం పట్ల భక్తులు, ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక–సామాజిక కార్యక్రమాలు మరింతగా ఉపకరిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.