అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఉండకూడదని, లోపాలు తలెత్తితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. శనివారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించి పరిశీలించారు.

‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ పర్యటనలో ఎమ్మెల్యే మొదటగా అంగన్వాడీ కేంద్రాల వంటగదులను పరిశీలించారు. అక్కడ భోజనం తయారీ విధానం, నిల్వ విధానం, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యత, వేడి స్థాయి, సమయానికి అందిస్తున్నారో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తదుపరి భోజనశాల, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, కేంద్రాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. కేంద్రాల్లో నమోదు అయిన పిల్లల సంఖ్య, రోజువారీ హాజరు వివరాలను సిబ్బందిని అడిగి రికార్డులు చూసారు. పిల్లలకు అందించే ఆహారం, పోషకాహార పదార్థాలు క్రమం తప్పకుండా అందుతున్నాయా లేదా అనే అంశంపై కూడా ఆమె ఆరా తీశారు.

అనంతరం నిర్వహించిన అంగన్వాడీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. అర్హత సాధించిన చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారిని అభినందించారు. కార్యక్రమం అనంతరం పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే, వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు.

పర్యటన సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యల గురించి స్థానికులు, సిబ్బందితో ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. కొన్ని కేంద్రాలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, అవాంఛిత వ్యక్తుల రాకపోకలు పెరుగుతున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పైస్థాయికి పంపుతామని తెలిపారు.

కమలానగర్ ప్రాంతంలో రెండు అంగన్వాడీ కేంద్రాలతో పాటు గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ వంటి భవనాలు అన్నీ పక్కపక్కనే ఉండటంతో అక్కడ రద్దీ, పార్కింగ్, పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే సేవలపై ఎలాంటి రాజీ ఉండకూడదని, పిల్లల ఆరోగ్యం, విద్య, పోషకాహారం విషయంలో సిబ్బంది మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించినట్లు సమాచారం. కేంద్రాల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆమె సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు.