తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి: కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్

తాడిపత్రి: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి జోక్యాలు, ఒత్తిడులు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచడం, దౌర్జన్యాలకు పాల్పడడం, పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన సవాల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నిజంగా ధైర్యం, దమ్ము ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించి తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా సజావుగా జరిగేలా సహకరించాలని కేతిరెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు ఎవరికి మద్దతుగా ఉన్నారో స్పష్టంగా బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల్లో అన్నీ నీతులు, ఆచరణలో మాత్రం తప్పులే కనిపిస్తున్నాయని కేతిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. యల్లనూరు మండలంలో జేసీ వర్గం రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తోందని, అక్కడి పరిస్థితులను ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

జేసీ వర్గీయుల దాడులపై బాధితులు ఫిర్యాదులు చేసినా తాడిపత్రి పోలీసులు స్వీకరించడం లేదని కేతిరెడ్డి ప్రశ్నించారు. బాధితుల తరఫున నిలబడాల్సిన పోలీసులు, నిందితుల పక్షాన నిలబడటం సరైన విధానమా అని ఆయన నిలదీశారు. ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లాభం పొందేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అలజడి సృష్టించే విధంగా రాజకీయాలు చేస్తున్నారని కేతిరెడ్డి విమర్శించారు. అదేవిధంగా జేసీ ట్రావెల్స్‌కు చెందిన వాహనాల రిజిస్ట్రేషన్లలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపించి, నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తాడిపత్రి పోలీసులు వేధింపులు ఆపాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. తాడిపత్రి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే కాదా అని ప్రశ్నించిన కేతిరెడ్డి, వారు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.