రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఆడవేషాలు వేసుకుని క్షుద్రపూజల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న కిలాడీ కేటుగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయంటూ నమ్మబలికి లక్షలాది రూపాయలు, బంగారం దోచుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చివరకు మోసపోయిన బాధితురాలు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించింది.
రామసముద్రం మండలానికి చెందిన సాకక్కగారి నాగరాజ సరస్వతమ్మ దంపతుల కుమార్తె ఉమ భర్తతో విడిపోయి ఎనిమిదేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఈ సమయంలో కలకడ మండలం నమ్మూరోల్లపల్లికి చెందిన సిద్ధలింగయ్య నాయుడు కుమారుడు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ అలియాస్ హనీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఉమ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగిన నిందితుడు, వారి ఇంట్లో గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని, అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నారని నమ్మబలికినట్టు బాధితురాలు తెలిపింది.
వాటిని పారదోలాలంటే శక్తి పూజలు, శాంతి పూజలు చేయాల్సిందేనని చెప్పి మోహన కృష్ణమ నాయుడు వారి ఇంట్లోనే తిష్టవేశాడు. పూజల పేరుతో లక్షల్లో డబ్బు, బంగారం తీసుకున్నాడు. ఒంటరిగా ఉన్న ఉమకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తానని చెప్పి మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలోని ఇంటికి తీసుకెళ్లి, ఆమె ఆస్తి మొత్తాన్ని అమ్మించి వచ్చిన డబ్బంతా తనవైపు తిప్పుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందే ఖాళీ బాండ్ పేపర్లపై ఆమె సంతకాలు కూడా తీసుకున్నట్టు సమాచారం.
ఇంటికి పూజల కోసం ఎవరు వచ్చినా, నిందితుడు అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టు నటిస్తూ చేతిలో త్రిశూలం, దండన కర్ర పట్టుకుని, నోట్లో రూ.500 నోట్లను పంటితో బిగబట్టి పూనకంతో ఊగిపోయేవాడని స్థానికులు చెబుతున్నారు. తాంత్రిక శక్తులతో దెయ్యాలను పారదోలుతానని నమ్మించి వచ్చిన వారి వద్ద నుంచి కూడా లక్షలు వసూలు చేసేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఉమ వద్ద ఉన్న డబ్బు, బంగారం కాజేసి వాటితో సొంత ఆస్తులు కూడబెట్టుకున్నాడని బాధితురాలు పేర్కొంది. గుప్త నిధుల తవ్వకాలు, క్షుద్రపూజల పేరుతో రాత్రివేళల్లో కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాలకు వెళ్లేవాడని ఆమె తెలిపింది. ఈ క్రమంలో సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ, కొత్తగా పరిచయమైన ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతూ ఉమను ఇల్లు వదిలి వెళ్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.
తాను మోసపోయానని గ్రహించిన ఉమ నిందితుడిని నిలదీయగా, తన అనుచరులతో కలిసి ఆమెను హతమార్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు ఆమె ఆరోపించింది. ప్రాణభయంతో రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు మీడియాకు తెలిపింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యకు కూడా వెనుకాడనని ఆమె కన్నీటి పర్యంతమై పేర్కొంది.
ఈ విషయమై రామసముద్రం ఎస్ఐ భషికేశ్వర రెడ్డి వివరణ కోరగా, నాలుగు నెలల క్రితం ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఆధ్వర్యంలో కేసు సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలిసిందని తెలిపారు. ప్రస్తుతానికి బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే విచారణ జరిపి ఉమకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఎస్ఐ స్పష్టం చేశారు.













