అన్నమయ్య జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ …

బోగస్‌ ఓట్లకు చెక్‌!

మదనపల్లె: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అన్నమయ్య జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. బోగస్‌ ఓట్లకు చెక్‌ పడుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. సర్‌ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత సిబ్బందికి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా పరిశీలనలో బూత్‌ లెవల్‌ వాలంటీర్లు (బీఎల్వోలు) కీలక భూమిక పోషిస్తున్నారు. రాష్ట్రంలో 24 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ సమగ్ర సవరణను 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని నిర్వహిస్తున్నారు. జిల్లాలో పునర్విభజన అనంతరం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన ప్రస్తుత పరిధిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 జాబితాతో పోల్చి లోపాలను గుర్తించి సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించే బాధ్యత బీఎల్వోలపై ఉంది. ప్రతి కుటుంబంలో ఉన్న ఓటర్ల వివరాలు నమోదు చేసి, వాటిని ఆన్‌లైన్‌ ద్వారా మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఓటరు ఇతర ప్రాంతానికి వలస వెళ్లినా, వివాహం కారణంగా చిరునామా మారినా సులభంగా గుర్తించేలా ఈ మ్యాపింగ్‌ ఉపయోగపడుతోంది. డబుల్‌ ఎంట్రీలు, వలసలు, వివాహాల కారణంగా మారిన ఓట్లను తొలగించి, ఒక్క వ్యక్తికి ఒక్క ఓటు మాత్రమే ఉండేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

జిల్లాలో ఈ ప్రక్రియ గత ఏడాది సెప్టెంబరు నుంచి కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు మ్యాపింగ్‌ విషయంలో ఆశించిన ఫలితాలు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ, ఎన్యుమరేషన్‌ పత్రాలు, ఓటర్ల జాబితాల ముద్రణ పనులు చేపడుతున్నారు.

జూన్‌ 15 నుంచి జులై 14 వరకు బీఎల్వోలు ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. జులై 14 నాటికి పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ పూర్తి చేసి, జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. జులై 21 నుంచి సెప్టెంబరు 18 వరకు వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగించి, అనంతరం సెప్టెంబరు 22న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలని షెడ్యూల్‌ ఖరారు చేశారు. సర్‌ కార్యక్రమాన్ని ప్రతిపక్షం, అధికారపక్షం రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదని పార్టీ నాయకులు తమ కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నారు.

ఇక ప్రభుత్వ అధికారులు మాత్రం ఇప్పటికే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా, సమర్థంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తామని వారు వెల్లడిస్తున్నారు. జిల్లా నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 12,32,439గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి కోసం 1,334 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మ్యాపింగ్‌ పూర్తి అయిన ఓటర్ల సంఖ్య 5,39,985గా ఉన్నట్లు సంబంధిత విభాగం వివరాలు వెల్లడించింది.