అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలు, మోసపూరిత కార్యకలాపాలతో రౌడీ షీట్ దారిగా పేరుపొందిన లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉండగా, తాజాగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం, సులోచనపై మదనపల్లె 1 టౌన్, 2 టౌన్, తాలూక తదితర పోలీస్ స్టేషన్లలో మొత్తం 14 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు భూ కబ్జా, హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలపై కూడా కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. భూములపై అక్రమంగా హక్కులు సాధించేందుకు సులోచన అమాయకులను మోసం చేసి, నకిలీ పత్రాలు తయారు చేయించడం, బెదిరింపులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డిఎస్పీ ప్రసాద్ ల ఆదేశాల మేరకు మదనపల్లె వన్ టౌన్ పోలీసులు గురువారం ఉదయం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సులోచనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఆమెను వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

సులోచన కార్యకలాపాల వల్ల మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో పలువురు బాధితులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమెపై ఇప్పటికే రౌడీ షీట్ తెరిచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నప్పటికీ, ఇటీవల కాలంలో మళ్లీ చురుకుగా మారడంతో పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

అన్నమయ్య జిల్లాలో భూ కబ్జాలు, చీటింగ్ కేసులను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో లేడీ డాన్ సులోచన అరెస్ట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఆమెతో పాటు ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తూ, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.