రాయలసీమ న్యూస్, అన్నమయ్య: మదనపల్లె అన్నమాయ జిల్లాలో గుండా వెళ్లే జాతీయ రహదారులపై రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నిలిపే వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. విశాలమైన రహదారులపై వేగంగా ప్రయాణించే వాహన చోదకులు ఇలాంటి నిలిపిన వాహనాలను ఢీకొని తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతి ఏడాది వందల మంది ఇలాంటి ఘటనల్లో మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మీదుగా ఐదు జాతీయ రహదారులు వెళ్లుతున్నాయి. హైవే పెట్రోలింగ్, రవాణాశాఖ, స్థానిక పోలీసులు ఉన్నప్పటికీ రహదారులపై వాహనాలను నిలిపే వారిని ఎవరూ అడ్డుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. తప్పు వాహన చోదకులదే అయినా, ఈ సమస్యను పట్టించుకోకుండా ఉన్న అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువ ప్రాణనష్టానికి కారణమవుతోందని వారు అంటున్నారు.
కురబలకోట మండలం చేనేత నగర్ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదం దీనికి ఉదాహరణగా నిలిచింది. రోడ్డు పక్కన నిలిపిన ఐచర్ వాహనాన్ని గుర్తించలేక ప్రయాణికులతో వెళ్తున్న ఆటో వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐచర్ వాహన డ్రైవర్ పార్కింగ్ లైట్లు ఆన్ చేయకపోవడంతో చీకట్లో వాహనం కనిపించలేదని, అందుకే ఆటో ఢీకొట్టిందని బాధితులు తెలిపారు.
ములకలచెరువు మండలం వేపూరికోట సమీపంలో ముగ్గురు విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మదనపల్లె–బెంగళూరు రహదారిపై, మదనపల్లె పట్టణంలోని కురవంకకు చెందిన 22 ఏళ్ల యువకుడు రోడ్డుపై నిలిపిన సిమెంట్ లారీని ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. నిలిపిన వాహనానికి ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.
మదనపల్లె జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి పట్టణంలో వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. అనంతపురం, తిరుపతి, కడప, చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలు తప్పనిసరిగా మదనపల్లె పట్టణం గుండా వెళ్లాల్సి వస్తోంది. బైపాస్ లేకపోవడంతో పెద్ద వాహనాలు పట్టణంలో ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయాల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. అప్పటి వరకు జాతీయ రహదారిపై వాహనాలను ఆపి వేయడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది.
పట్టణంలో తోపుడు బండ్లు రోడ్డుకు ఇరువైపులా నిలిపి విక్రయాలు చేయడం, ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు ఉండటం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. పెద్ద వాహనాలు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు పట్టణంలోకి రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, బైపాస్ లేకపోవడంతో జాతీయ రహదారి 42పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
మదనపల్లె పట్టణంలోని అమ్మచెరువు మిట్ట నుంచి బెంగళూరు రోడ్డు వరకు అవుటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తే, బెంగళూరుకు వెళ్లే వాహనాలు పట్టణంలోకి రాకుండానే వెళ్లిపోవచ్చని స్థానికులు సూచిస్తున్నారు. దీంతో రహదారులపై గంటల తరబడి వాహనాలు నిలిపే అవసరం తగ్గి, ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుతుందని వారు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై అధికారులు తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల రాత్రి వేళల్లో నిలిపిన వాహనాల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ట్రాక్టర్లు, లారీలు, ఇతర పెద్ద వాహనాలపై రేడియం రిఫ్లెక్టర్లు తప్పనిసరిగా అమర్చాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా తప్పవని ఎస్పీ ధీరజ్ స్పష్టం చేశారు.













