పేదల రేషన్‌ బియ్యం పక్కదారి…

సరిహద్దు మండలాల నుంచి అక్రమ రవాణా

మదనపల్లె : పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యం యథేచ్ఛగా పక్కదారి పడుతోంది. తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న దందా విస్తరిస్తోంది. రేషన్‌ బియ్యాన్ని మర పట్టించి పిండి, రవ్వ ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణా వెనుక కొంతమంది ప్రభావశీలుల హస్తం ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

పేదలకు పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ ద్వారా బియ్యం అందించడానికి ప్రభుత్వం కిలోకు రూ.48లకు కొనుగోలు చేసి రూపాయికే అందజేస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు చౌక దుకాణాల్లో బియ్యం తీసుకొని తిరిగి డీలర్లకు, వ్యాపారులకు కిలోను రూ.15కు విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని వ్యాపారులు మార్కెట్లో రూ.18 నుంచి రూ.20 మధ్య అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల తూకాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో జరిగిన దాడుల్లో భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం అయింది. మే 7న మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలోని ఓ కూరగాయల వ్యాపారి ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.1.75 లక్షల విలువైన 3 టన్నుల బియ్యం పట్టుబడింది. ఇతను ఇతరుల నుంచి బియ్యం సేకరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.

జూన్‌ 2న ములకలచెరువు మండలంలోని చౌడసముద్రం, సోంపల్లి చౌక దుకాణాలను కడప విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేయగా, లెక్కల్లో చూపిన దానికంటే 1,082 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. మే 20న బి.కొత్తకోటలో 12 క్వింటాళ్ల బియ్యం పట్టుకొని సంబంధిత డీలరుపై 6ఏ కేసు నమోదు చేశారు. మే 9న పీటీఎం మండలంలోని కందూకూరులో 12.25 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మార్చి 6న మదనపల్లెలోని రెండు రైస్‌ మిల్లుల్లో 475 కిలోల రేషన్‌ బియ్యం దొరికింది.

బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మండలాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కావడంతో పాటు చెక్‌పోస్టులు లేకపోవడం వల్ల జిల్లాలోని చాలా సరకు ఈ మండలాల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, శ్రీనివాసపురం, రాయల్‌పాడు, చింతామణి ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిపోతోంది. ఆ ప్రాంతాల్లో వలస కూలీలు అధికంగా ఉండటంతో తక్కువ ధరకు లభించే రేషన్‌ బియ్యాన్ని వ్యాపారుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. అక్కడున్న కోళ్లఫారాల యజమానులు కూడా రేషన్‌ బియ్యంపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కొందరు వ్యాపారులు ఈ బియ్యాన్ని పాలిష్‌ చేయించి నాణ్యమైన బియ్యంలో కలిపి అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.