రాయలసీమ న్యూస్, అన్నమయ్య: మదనపల్లె: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివేడు గ్రామం మావిళ్లపల్లిలో పేద మహిళ మావిళ్ల శ్రీదేవి సమస్యను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గ్రామ వీఆర్వో నిర్మల్‌కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు.
సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పార్టీ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, బాధితురాలు మావిళ్ల శ్రీదేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మావులూరి విశ్వనాథ్, చంద్రశేఖర్ మాట్లాడుతూ మావిళ్ల శ్రీదేవి అప్పోసప్పో చేసి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు ఆమె ఇంటి ముందు కాంపౌండ్ గోడ నిర్మించి, ఆమె బయటకు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఈ సమస్యపై గత ఏడాది నుంచి రెవెన్యూ అధికారులను పలుమార్లు ఆశ్రయించినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం రాలేదని నాయకులు పేర్కొన్నారు. వీఆర్వో నిర్మల్‌కుమార్‌పై బాధితురాలు తహసీల్దార్, ఆర్డీవో, జేసీలకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
అధికారులు తక్షణమే స్పందించి బాధితురాలు మావిళ్ల శ్రీదేవికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్వో నిర్మల్‌కుమార్‌తో పాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, వీఆర్వోను సస్పెండ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు మావిళ్ల శ్రీదేవి, మావిళ్ల నాగార్జున, వేణుగోపాల్, వీరమల్లమ్మ, కదిరప్ప, బాబు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.













