రాయలసీమ న్యూస్, అన్నమయ్య: మదనపల్లె: చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎం.పి. ఆనందం, అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి. సుబ్రహ్మణ్యం, జనరల్ సెక్రటరీ శ్రీమతి ఎ. కవితా రాణి, కోశాధికారి శ్రీమతి పట్నం గిరిజమ్మాళ్, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ ఎం. రామకృష్ణయ్య, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు ఉపన్యాసాలు, సూక్తులు, పాటలు, నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని రంజింపజేశారు. ఈ సందర్భంగా గురువుల పట్ల తమ గౌరవాన్ని విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వ్యక్తం చేశారు.

“నేటి తరానికి ఉపాధ్యాయులు పట్టుకొమ్మల వంటివారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే మహోన్నత బాధ్యత ఉపాధ్యాయులది. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైనది”
అని అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి. సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
“గురు అనుగ్రహం, ఉపాధ్యాయుల ఆశీస్సులు ఉంటేనే విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలరు. అజ్ఞానం అనే చీకటి నుండి విజ్ఞానం అనే వెలుగులోకి నడిపించే వారు గురువులు. అందుకే గురువులకు శతకోటి వందనాలు”
అని జనరల్ సెక్రటరీ శ్రీమతి ఎ. కవితా రాణి తెలిపారు. విద్యార్థులు తమ గురువులను గౌరవించి, వారి బాటలో నడవాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు, కానుకలు అందజేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన శ్రీమతి సి.ఆర్. రెడ్డి ప్రసన్నకు ప్రశంసా పత్రం అందజేసి, సన్మానంతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ బి. జనార్ధన్, శ్రీమతి సి.ఆర్. రెడ్డి ప్రసన్న, శ్రీమతి ఈ. భార్గవి, శ్రీమతి ఎస్. భారతి, శ్రీమతి డి. నేత్రావతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చివరగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ, సమాజ నిర్మాణంలో వారి పాత్ర చిరస్మరణీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విజయవంతంగా ముగించారు.













