రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా రాజంపేటలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తున్న నాగేంద్ర అనే వ్యక్తి సుమారు రూ.30 కోట్లకు పైగా ప్రజలకు టోకరా పెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారం మంగళవారం రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ దృష్టికి వచ్చింది.
రాజంపేట మండలం ఎల్లాగడ్డకు చెందిన నాగేంద్ర గత కొంతకాలంగా రాజంపేటలో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని వద్ద స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో చిట్టీలు కట్టినట్లు తెలిసింది. చిట్టీలతో పాటు పలువురి నుంచి అప్పులు కూడా తీసుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నుంచి చిట్టీ మొత్తాలు, అప్పులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని, చివరకు చేతులెత్తేయడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు.
బాధితుల ఫిర్యాదుల మేరకు నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిట్టీల నిర్వాహకుడు పోలీసుల కస్టడీలో ఉన్నట్టు తెలిసిన బాధితులు మంగళవారం ఒక్కొక్కరుగా రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ పరిసరాల్లో బాధితుల రద్దీ కనిపించింది.
ఈ క్రమంలో బాధితుల్లో ఒకరు మీడియాతో మాట్లాడినప్పుడు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ వ్యవహారంపై పంచాయతీ చేసి సెటిల్ చేసుకున్నారని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపణలు చేసినట్టు సమాచారం. అతని వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ విషయం తెలిసిన కొందరు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారి, ఆ బాధితుడిపై వారు దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
తర్వాత అదే బాధితుడు మీడియా ముందు తన మాటలను మార్చడం మరింత ఆసక్తికరంగా మారింది. ఎవరో ఎదో చెబితే తాను కూడా అలాగే చెప్పానని, అధికార పార్టీ నాయకులకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, పొరపాటున అలా మాట్లాడిపోయానని ఆ బాధితుడు చెప్పినట్టు స్థానికులు పేర్కొంటున్నారు.
చిట్టీల మోసం కారణంగా లక్షలు, కోట్ల రూపాయలు ఇరుక్కుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టార్జిత డబ్బులు తిరిగి దక్కేలా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈ ఘటనతో రాజంపేట పట్టణంలో చిట్టీల వ్యాపారంపై ఆందోళన వ్యక్తమవుతోంది.













