రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలను మరోసారి మోసం చేశారంటూ ఆరోపించారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంలో చంద్రబాబుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ నిర్ణయాన్ని చేర్పించి ఉండాల్సిందని BSP నాయకులు అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో ఈ హామీ అమలు చేయడం సాధ్యమేనని వారు పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు గతంలో బీసీల కోసం ప్రకటించిన BC Declarationలో, అలాగే 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని BSP నాయకులు గుర్తుచేశారు. ఆ హామీని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేసి ఉండాల్సిందని వారు అన్నారు.
బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని BSP డిమాండ్ చేసింది. టీడీపీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే టీడీపీ అని చంద్రబాబు తరచూ చెబుతున్న నేపథ్యంలో, ఆ ప్రేమను కార్యరూపంలో చూపించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.
రాయచోటిలో నిర్వహించిన కార్యక్రమంలో BSP నాయకులు ఈ డిమాండ్లను స్పష్టంగా వెల్లడించారు. బీసీలకు న్యాయం చేయాలంటే, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేదంటే బీసీ వర్గాల అసంతృప్తి మరింత పెరుగుతుందని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ పెదవిటి నరసింహులు హాజరయ్యారు. BSP పార్టీ వీరబల్లి మండలం అధ్యక్షుడు మద్దెల వెంకటరమణ, ఇతర BSP పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీల హక్కులు, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థలలో వారి ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చ జరిగింది.













