రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి పట్టణంలో జనసేన టౌన్ యూత్ ప్రెసిడెంట్ ముదిరిన విజయ్ కుమార్ అలియాస్ బుల్లెట్ విజయ్, ఆయన భార్య జనసేన వీర మహిళ పద్మావతిపై దాడి జరిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే కారణంతోనే తమపై దాడి జరిగిందని జనసేన శ్రేణులు పేర్కొంటున్నారు. రాయచోటి ప్రాంతానికి చెందిన శివారెడ్డి, మోహిత్ రెడ్డి, మస్తాన్, ఉమర్ తదితరులు ఈ ఘటనలో పాల్గొన్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దాడి సమయంలో ముదిరిన విజయ్ కుమార్, పద్మావతిపై రాళ్లతో విరుచుకుపడిన దృశ్యాలను వీడియోగా చిత్రీకరించినట్లు సమాచారం. వీడియో తీస్తూ, రాళ్లతో దాడి చేయడం టీడీపీ నేతల పైశాచికానికి నిదర్శనమని జనసేన వర్గాలు విమర్శిస్తున్నాయి.
కూటమిలో భాగస్వామ్య పార్టీ నేతలకే రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలంటూ జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ నాయకులపై ఇలా బహిరంగంగా దాడులు జరుగుతుంటే, ప్రజల భద్రతపై తీవ్ర సందేహాలు నెలకొంటాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
రాయచోటి ప్రాంతంలో ఈ ఘటనపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, రాజకీయ భిన్నాభిప్రాయాల పేరుతో హింసకు పాల్పడే వారిని అదుపులో పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కూటమి పార్టీల మధ్య సంబంధాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనసేన నేతలపై జరిగిన దాడి విషయమై సంబంధిత శాఖలు, పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.













