రాయచోటి పట్టణంలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం చేసి, తర్వాత బాధితులనే నేరగాళ్లుగా చూపేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రాయచోటి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, రాయచోటి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సాగర్‌ తన సమీప బంధువు, మరికొందరితో కలిసి ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురి నుంచి మొత్తం రూ.45 లక్షలు వసూలు చేశాడు. నిర్దిష్ట గడువులో ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటే రాయచోటికి రావాలని బాధితులకు సాగర్‌ వర్గం సూచించింది. దాంతో విజయవాడకు చెందిన కొందరు బుధవారం కారులో రాయచోటికి చేరుకున్నారు. వారు రాయచోటి రింగ్‌రోడ్డులో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన కానిస్టేబుల్‌ సాగర్‌, అతనికి వరుసకు సోదరుడైన వ్యక్తి బాధితులతో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, గంజాయి పొట్లాలను గుట్టుచప్పుడు కాకుండా వారి కారులో ఉంచినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

తర్వాత అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆ కారులో గంజాయి తరలిస్తున్నారని తెలిపినట్లు వెల్లడైంది. ఈ సమాచారాన్ని నమ్మిన పోలీసు అధికారులు, సంబంధిత వారిని స్టేషన్‌కు తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు. బాధితులపై గంజాయి కేసు నమోదు చేసే దిశగా విచారణ సాగుతుండగా, సంఘటనపై వచ్చిన ఇతర సమాచారం, అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు.

వారి దృష్టికి పూర్తి వివరాలు వెళ్లిన అనంతరం, గంజాయి పొట్లాలను బాధితుల కారులో ఉంచింది కానిస్టేబుల్‌ సాగర్‌ బంధువులేనని, ఇది ముందస్తు పన్నాగమని దర్యాప్తులో తేలింది. దీంతో బాధితులను ఇరికించే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్‌ సాగర్‌, అతని బంధువులు సహా మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ స్పందించారు. కానిస్టేబుల్‌ సాగర్‌, అతని బంధువులపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ధృవీకరించారు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలు అన్నీ విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందని డీఎస్పీ స్పష్టం చేశారు.