రాయచోటి : గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డులో ప్రమాదం మళ్లీ ప్రాణాలు బలితీసుకుంది. సోమవారం రాత్రి ఘాట్‌ రోడ్డులో రెండో మలుపు వద్ద ఓ లారీలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. రాత్రి వేళలో జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగసిపడుతూ ఉండటంతో కొంతసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. లారీ పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతంలో అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరణించిన వారు తమిళనాడుకు చెందిన పలని (50), సుబ్రహ్మణ్యం (50) అని గుర్తించారు. లారీ బోల్తా పడి అనంతరం అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

లారీ పూర్తిగా దగ్ధమవడంతో ఆస్తి నష్టం ఎంతమేర జరిగిందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం, లారీ ఏ వస్తువులు తరలిస్తోందన్న వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

గువ్వలచెరువు ఘాట్‌ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు వందలాది ప్రాణాలు బలైపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం టన్నెల్‌ పనులు ప్రారంభించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, టన్నెల్‌ నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.