రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని NDA కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు కోఆర్డినేటర్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో NDA కూటమి నేతల సమన్వయ, సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుంచి తాతంశెట్టి నాగేంద్ర, అతికారి క్రిష్ణ, దారం అనిత పాల్గొన్నారు. టీడీపీ తరఫున జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, జోనల్ కోఆర్డినేటర్ దామంచర్ల సత్య, బీజేపీ నుంచి రమేష్ నాయుడు, చల్లపల్లి నరసింహారెడ్డి హాజరయ్యారు.
జూమ్ కాల్ ద్వారా అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. వీరు కూటమి నేతలకు పలు సూచనలు, సలహాలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని చేపట్టాల్సిన కార్యాచరణ, అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాలు, మూడు పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల స్థాయిలో కూటమి నేతలు, కార్యకర్తలతో సమీక్షలు, సన్నాహక సమావేశాలు నిర్వహించి ఎన్నికల కార్యాచరణను మరింత పటిష్టం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు నేతలు తెలిపారు.
ప్రజారంజక పాలన ద్వారా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రగతిలో స్థానిక సంస్థల పాత్ర దృష్ట్యా, వాటి ద్వారా దేశాభివృద్ధికి కూడా తోడ్పాటు లభిస్తుందని వారు పేర్కొన్నారు.
కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ప్రతి స్థాయిలో కూటమి బలాన్ని ప్రదర్శించాలని నేతలు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో NDA కూటమి లక్ష్య సాధనకు తగిన విధంగా బూత్ స్థాయిలోనుంచి మండల, జిల్లా స్థాయిల వరకు కార్యాచరణ రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.













