రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: గత మూడు సంవత్సరాలుగా బాడుగ భవనాలలో కొనసాగుతున్న రాయచోటి కోర్టులకు శాశ్వత నూతన భవనాలు నిర్మించాలంటూ రాయచోటి న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఈ మేరకు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్ ద్వారా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
రాయచోటి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్. లక్ష్మీదేవి, కార్యదర్శి వి. సిద్దయ్య, ట్రెజరర్ కుసుమ, స్పోర్ట్స్ సెక్రటరీ టీవీ రమణ నేతృత్వంలో న్యాయవాదుల బృందం మంగళవారం మధ్యాహ్నం కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్‌ను కలిసింది. ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు.
న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వివరించిన మేరకు, 2023 జనవరి నుండి రాయచోటి పిడిఎం కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు బాడుగ భవనాలలోనే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని హైకోర్టు పోర్ట్ఫోలియో న్యాయమూర్తికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ద్వారా తెలియజేయాలని వారు కోరారు.
పాత కోర్టు భవనాల స్థానంలోనే జి ప్లస్ ఫైవ్ నమూనాలో ఆరు కోర్టు భవనాలను నిర్మించే అవకాశం ఉందని రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా తక్షణమే కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు.
రాయచోటి కోర్టులు ప్రస్తుతం బాడుగ భవనాలలో కొనసాగుతుండటంతో న్యాయవాదులు, న్యాయ సేవలు పొందుతున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా ఈ సమస్యలు తగ్గుతాయని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగాలంటే తగిన సదుపాయాలతో కూడిన భవనాలు అత్యవసరమని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యు. ధనుంజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, ఆర్. ఆనంద్ కుమార్, చిన్నయ్య, కే. నాగేశ్వర్, రాజగోపాల్ రెడ్డి, నాగ అర్చన, ఈశ్వర్, నిరంజన్, వరలక్ష్మి, ఉత్తేజ్ కుమార్, వెంకటేశ్వర ఆచారి తదితరులు పాల్గొన్నారు.













