రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, గత పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు–తాగునీటి సమస్యల పరిష్కారంపై వివరాలు వెల్లడించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

రాయచోటి రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గమని, రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో జరగని రీతిలో తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.450 కోట్లతో ఆరు మండలాల ప్రజలకు తాగునీరు అందించే చర్యలు ప్రారంభించామని చెప్పారు.

అమృత్ పథకం నిధులను వెనక్కి పంపించిన ఘనత వైసీపీ గత పాలకులదేనని మండిపల్లి ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్ల తాగునీరు, సాగునీటి అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని విమర్శించారు. 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు చేపట్టామని, సుమారు రూ.420 కోట్లతో శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

“రాయచోటికి వచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం. నేను చేసిన పనులు చూపిస్తా, నువ్వు చేసిన పనులు చూపించగలవా?”

మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపై మండిపల్లి తీవ్రంగా మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా కార్యకర్తలను పట్టించుకోని శ్రీకాంత్‌రెడ్డి ఇప్పుడు వారి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన నాయకుడి మెప్పు పొందేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. నామినేషన్ అభ్యర్థులను బెదిరించారంటూ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అది బెదిరింపు కాదని, శ్రీకాంత్‌రెడ్డి వైసీపీ కార్యకర్తలను బలిపశువులుగా చేయొద్దని మాత్రమే సూచించానని చెప్పారు.

గత ఎన్నికల్లో ఏం జరిగిందో మరిచిపోయి ఇప్పుడు ప్రతివ్రతల నీతులు చెబుతున్నారని మండిపల్లి విమర్శించారు. కవ్వింపు చర్యలకు పాల్పడి నియోజకవర్గంలో ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. తన వల్ల జిల్లా కోల్పోయామని చేస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తూ, ఎవరి వల్ల పోయిందో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.

హిందూ, ముస్లింల మధ్య గొడవలను రాజకీయాలకు వాడుకున్నది శ్రీకాంత్‌రెడ్డేనని, మతపరమైన అంశాలపై రాజకీయం చేసింది ఆయనేనని మండిపల్లి ఆరోపించారు. 22 ఏళ్ల పాటు కష్టపడి ఎమ్మెల్యేగా ఎదిగానని, ఎవరి కాళ్లు పట్టుకుని పదవులు సంపాదించలేదని స్పష్టం చేశారు. తన ప్రెస్టేజ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగితే రాజకీయంగా గట్టిగా సమాధానం చెబుతానని హెచ్చరించారు.

“రాయచోటి మున్సిపల్ ఎన్నికల నుంచి గ్రామ, వార్డు ఎన్నికల వరకు నియోజకవర్గంలోనే ఉంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రానున్న 40 రోజులు నియోజకవర్గంలోనే ఉండి కార్యకర్తలకు అండగా నిలవాలి.”

అధికారులను బెదిరిస్తున్నానంటూ సానుభూతి కోసం ఆరోపణలు చేయడం మానుకోవాలని మండిపల్లి సూచించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీకాంత్‌రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత రాయచోటికి రావడం మానేశారని విమర్శించారు. తనకు ఎవరి మద్దతు అవసరం లేదని, తాను ఏమిటో శ్రీకాంత్‌రెడ్డికి బాగా తెలుసునని అన్నారు.

రాయచోటి అభివృద్ధిపై మాట్లాడుతూ పట్టణంలో రూ.30 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, పట్టణ సుందరీకరణ పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని తెలిపారు. మైనారిటీల కోసం శంకుస్థాపన చేసిన పనులు గత పాలకుల హయాంలో ఎందుకు పూర్తికాలేదో వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి, ఆధునికీకరణ పనులపై కూడా గత పాలకులు జవాబు చెప్పాల్సి ఉందని అన్నారు.

గాలివీడులో అభివృద్ధి పనులు చేపట్టామని, రాయచోటిలోనూ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మండిపల్లి వివరించారు. రాయచోటికి వచ్చిన ప్రతి రూపాయి, చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిపై ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.