అన్నమయ్య జిల్లా, గాలివీడు: సమయస్ఫూర్తి, బాధ్యతాయుత వైఖరితో మూడు నిండు ప్రాణాలను రక్షించిన గాలివీడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె. నరసింహారెడ్డి, ఆయన సిబ్బందిని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

శనివారం రాత్రి సుమారు 7.15 గంటల సమయంలో గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉండగా అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా, తలుపుల మండలానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర ఆందోళనతో ఫోన్ చేసి కుటుంబ కలహాల కారణంగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాలివీడు మండలంలోని వెలిగల్లు డ్యామ్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని కాపాడాలని వేడుకున్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఎస్ఐ నరసింహారెడ్డి తన సిబ్బందితో కలిసి హుటాహుటిన వెలిగల్లు డ్యామ్ వైపు దూసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న ఆ మహిళను, ఆమె పక్కనే ఉన్న ఇద్దరు చిన్నారులను గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసి చాకచక్యంగా స్పందించిన ఎస్ఐ, సిబ్బంది ముగ్గురినీ అడ్డుకుని సురక్షితంగా రక్షించారు.

తరువాత ఆ మహిళను పోలీసులు విచారించారు. భర్తతో ఉన్న మనస్పర్థల కారణంగానే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. వెంటనే పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించి స్టేషన్‌కు రప్పించారు.

క్షణికావేశంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు మాట్లాడుకుని పరిష్కార మార్గాలు వెతుక్కోవాలని ఆ మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఆ మహిళను, ఇద్దరు పిల్లలను బంధువుల సమక్షంలో సురక్షితంగా వారికి అప్పగించారు.

ఈ ఘటనపై స్పందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడంలో ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించి ముగ్గురి ప్రాణాలను నిలబెట్టిన గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి, ఆయన సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజల ప్రాణ, మాన రక్షణలో అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన స్పష్టం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.