రాయలసీమ న్యూస్, నంద్యాల: ఉయ్యాలవాడ మండలంలోని బోడెమ్మనూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాతల సాయంతో బస్సు సౌకర్యం లభించింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం సుమారు 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. సమీప గ్రామాలైన పుచ్చకాయలపల్లి, కాకరవాడ, అక్కంపల్లి నుంచి మాత్రమే 75 మంది విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నారు.
ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఈ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పాఠశాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన బోడెమ్మనూరు గ్రామానికి చెందిన ‘బోడెమ్మనూరు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ ముందుకు వచ్చింది. పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని సొసైటీ నిర్ణయించింది.
ఈ క్రమంలో సొసైటీ ప్రతినిధులు పోచా వెంకటరెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, వీరారెడ్డి, ఆదినారాయణరెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, బి.వి. సుబ్బారెడ్డి తదితరులు విరాళాలు సేకరణకు శ్రీకారం చుట్టారు. వారి ప్రయత్నాలతో దాదాపు రూ.23.50 లక్షల విరాళాలు సమీకరించగలిగారు. ఈ నిధులతో 41 సీట్ల సామర్థ్యం గల బస్సును కొనుగోలు చేసి పాఠశాలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కొత్త బస్సును బుధవారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. శరభారెడ్డి, ఉపాధ్యాయుడు వెంకటరమణయ్యలకు సొసైటీ ప్రతినిధులు అధికారికంగా అందజేశారు. బస్సు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం కలుగుతుందని, విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
పాఠశాల పునఃప్రారంభం అయిన వెంటనే ఈ బస్సు విద్యార్థుల రవాణా కోసం వినియోగంలోకి వస్తుందని ప్రధానోపాధ్యాయుడు ఎస్. శరభారెడ్డి తెలిపారు. బస్సు నిర్వహణ, ఇంధన వ్యయాల కోసం కూడా సొసైటీతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల విద్యాభ్యాసానికి రవాణా సౌకర్యం కీలకమని, ఈ దిశగా బోడెమ్మనూరు ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ చూపిన సామాజిక బాధ్యత ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.













