ఆళ్లగడ్డ:- జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేతన్నల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని పేర్కొన్నారు.

బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా ప్రతీ చేనేత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రూ. 25,000 ఆర్థిక సాయం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తమైంది. మేనిఫెస్టోలో ప్రత్యేక హామీ లేకపోయినా, చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71,536 కుటుంబాల ఖాతాల్లో మొత్తం రూ. 179 కోట్లు జమ చేయడం ద్వారా నేతన్నల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రతిఫలించిందని తెలిపారు.

చేనేత రంగంపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. చేనేత యూనిట్లకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే 50 ఏళ్లు దాటిన అర్హులైన నేతన్నలకు నెలకు రూ. 4,000 పింఛన్ అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి బృహత్తర ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పాడ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, మంగళగిరి చేనేత పార్క్, అమరావతి హస్తకళల మ్యూజియం వంటి ప్రాజెక్టుల ద్వారా చేనేత, హస్తకళల రంగాలకు మరింత బలాన్ని చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.

గతంలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన చేనేత కుటుంబాలను మళ్లీ ఆళ్లగడ్డకు రప్పించి, అక్కడ చేనేత రంగాన్ని పూర్తిగా బలోపేతం చేసే వరకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో శారద నగరంలో ఇంటింటికీ తిరుగుతూ గత రెండు సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజలకు వివరించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు.