రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌లో తప్పిపోయిన బాలికను పోలీసులు గంటలోపే గుర్తించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. పోలీసుల చాకచక్యంతో జరిగిన ఈ చర్య స్థానికంగా ప్రశంసలు పొందుతోంది.
కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడుకు చెందిన విజయరాజు, కావ్య దంపతులు తమ కుమార్తె వియతో కలిసి ఆళ్లగడ్డకు వచ్చారు. పని ముగించుకుని ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బాలిక కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఆందోళనకు గురైన వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్నపీరయ్య సిబ్బందితో కలిసి వెంటనే చర్యలకు దిగారు. బస్టాండ్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అందులో బాలిక నంద్యాల వెళ్లే బస్సులో ఎక్కినట్లు గుర్తించారు.
దీనిపై వెంటనే నంద్యాల ఆర్టీసీ డిపోకు సమాచారం అందించారు. అక్కడి సిబ్బంది సహకారంతో బాలికను సురక్షితంగా గుర్తించి తిరిగి ఆళ్లగడ్డకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించారు.
తక్కువ సమయంలో కేసును ఛేదించి బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్నపీరయ్య మరియు వారి బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. బాలికను సురక్షితంగా తిరిగి పొందిన తల్లిదండ్రులు కూడా పోలీసుల వేగవంతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.













