రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య సేవలను బలోపేతం చేసే పలు సదుపాయాలను శనివారం ప్రారంభించారు. బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ (ఐపీహెచ్‌ఎల్)ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తో కలిసి ప్రారంభించినట్లు BC జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ లాబొరేటరీ ద్వారా ప్రజలకు అవసరమైన వివిధ రకాల వైద్య పరీక్షలు ఒకేచోట అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ సేవల సామర్థ్యం పెరగనుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సమీపంలోనే నాణ్యమైన పరీక్షలు చేయించుకునే వీలుండేలా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

అదే కార్యక్రమంలో బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి Adani గ్రూప్ CSR ద్వారా రూ.1.50 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను కూడా ప్రారంభించినట్లు BC జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పరికరాల అందుబాటులోకి రావడంతో వైద్య పరీక్షలు, చికిత్స మరింత సులభతరం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సమకూరుస్తున్నామని BC జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

బనగానపల్లెలో రూ.71 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కూడా BC జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆయుర్వేద వైద్యశాల ద్వారా బనగానపల్లెతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆయుర్వేద వైద్యం, వైద్యుల సలహాలు, అవసరమైన మందులు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆయుర్వేద వైద్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఈ వైద్యశాల ద్వారా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రజలకు చేరువవుతాయని బీసీ జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత. గ్రామీణ ప్రాంతాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రజలందరూ ఈ ఆయుర్వేద వైద్యశాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి.













