నంద్యాల: బనగానపల్లె పట్టణంలో హుస్సేనీ బాషా సాహెబ్, జండా వాలే సాహెబ్ ఉరుసు ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు.

ఉత్సవాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణానికి చేరుకున్న మంత్రికి దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పూర్వక స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హుస్సేనీ బాషా సాహెబ్, జండా వాలే సాహెబ్ దర్గాలను దర్శించుకున్నారు.

దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించారు. బనగానపల్లె నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థనలు చేశారు. ఉత్సవాల సందర్భంగా దర్గా పరిసరాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి.

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బనగానపల్లెలో నిర్వహించే ఉరుసు ఉత్సవాలు హిందూ–ముస్లింల మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజలందరూ పరస్పర సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ ఉత్సవాలు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని మంత్రి భావించారు. ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్న దర్గా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించినట్లు సమాచారం.

ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం స్థానిక పోలీసు, రెవెన్యూ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బనగానపల్లె పట్టణం మొత్తం ఉత్సవాల వాతావరణంతో కళకళలాడుతోంది.