రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల జిల్లాలో భూసార పరిరక్షణతో పాటు పంట అవశేషాలను సద్వినియోగం చేసుకుని రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేందుకు బయోచార్ వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. ఈ దిశగా జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులకు, కోర్ టీమ్ సభ్యులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బయోచార్ వినియోగం, భూసార పరిరక్షణ, పంట అవశేషాల సద్వినియోగంపై కోర్ టీమ్‌తో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయోచార్ తయారీ విధానం, వ్యవసాయ భూముల్లో దాని వినియోగం, రైతులకు కలిగే ప్రయోజనాలపై సమగ్రంగా చర్చించారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలు పెరిగే అవకాశం ఉన్నందున, వాటిని సద్వినియోగం చేసుకునే ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ‘కోంటికి’ (Kontiki) వంటి పరికరాలను ఉపయోగించి ఆక్సిజన్ పరిమిత పరిస్థితుల్లో పంట అవశేషాలను ప్రాసెస్ చేసి బయోచార్‌గా మార్చే విధానాన్ని పరిశీలించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
బయోచార్‌ను తగిన మోతాదులో సేంద్రియ ఎరువులతో కలిపి వ్యవసాయ భూముల్లో వినియోగించడం ద్వారా నేల నాణ్యత, సేంద్రియ పదార్థాల స్థాయిని మెరుగుపరిచే అవకాశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. భూసార పరిరక్షణతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లాలో తొలిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి, దాని ఫలితాలను శాస్త్రీయంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఫోర్ రెడ్డి ఫౌండేషన్, క్లైమిత్ర అండ్ సర్కులారిటీ బయో తరఫున జిల్లావ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రూపొందించాల్సిన ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించాలని ఆమె ఆదేశించారు.
కోర్ టీమ్ సభ్యులు అందించే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని, రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాన్ని అమలు చేసి, దాని ఫలితాలను అంచనా వేయాలని కలెక్టర్ తెలిపారు. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని ఆమె సూచించారు.
బయోచార్ నేలలో కార్బన్‌ను స్థిరీకరించడంతో పాటు దీర్ఘకాలికంగా నేల నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యం కలిగి ఉందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్న నేపథ్యంలో, నంద్యాల జిల్లాలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దీని వినియోగ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ప్రాజెక్టుగా కాకుండా పంట అవశేషాల నిర్వహణ, భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణను అనుసంధానించే సమగ్ర చర్యగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత కంపెనీల ప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి, అంకిత శర్మ, రవిచంద్ర, నాబార్డ్ ఏజీఎం కార్తికేయ, ఎల్డియం అయ్యప్ప రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.













