రాయలసీమ న్యూస్, నంద్యాల: డోన్ పట్టణంలో అప్పుల బాధ ఓ కుటుంబాన్ని కుదిపేసింది. రుణభారం తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతుల్లో భర్త మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. డోన్ పట్టణంలోని వెంకటసాయినగర్ కాలనీలో నివసిస్తున్న బుధవారపు శ్రీనివాసులు (58), పద్మావతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. శ్రీనివాసులు కిరాణా సరకుల ఏజెన్సీ నిర్వహిస్తూ వ్యాపారం చేసేవాడు. వ్యాపార విస్తరణ, నిర్వహణలో భాగంగా అతను సుమారు రూ.కోటి మేరకు అప్పులు చేశాడు.
ఇటీవలి కాలంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవడంతో బుధవారం రాత్రి ఇంట్లోనే శ్రీనివాసులు, పద్మావతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
గురువారం ఉదయం వరకు ఇంటి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా, దంపతులు అచేతనంగా పడి ఉండటం గమనించారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందారు. పద్మావతి డోన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులు రాసిన సూసైడ్ నోట్ హృదయ విదారకంగా ఉందని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లకు ఉద్దేశించి రాసిన ఆ లేఖలో తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు.
అలాగే ప్రభుత్వానికి పన్నులు కూడా చాలా చెల్లించామని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని లేఖలో వేడుకున్నట్లు సమాచారం. ఈ లేఖ వారి మనోవేదనకు అద్దం పడుతోందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డోన్ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. అప్పుల బారిన పడి దంపతులు ఇలాంటి తీవ్ర నిర్ణయానికి దిగడం స్థానికులను కలచివేసింది.













