రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల: ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, పోరంబోకు భూముల విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ హెచ్చరించారు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలో గతంలో వీఆర్ఓగా పనిచేసిన మల్లారెడ్డి, సర్వే నంబర్ 507లోని గ్రామకంఠం (ప్రభుత్వ పోరంబోకు) భూమిని సరైన ఆధారాలు, సహాయక పత్రాలు లేకుండా ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టారు. సంబంధిత రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, గ్రామకంఠం భూమి స్థితిగతులపై ఆయన సమగ్రంగా పరిశీలించారు.
విచారణలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం డోన్-1 క్లస్టర్ వీఆర్ఓగా పనిచేస్తున్న మల్లారెడ్డిని బుధవారం సస్పెండ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణకు సంబంధించి ఉన్న సేవా నియమావళిని అతిక్రమించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామకంఠం, పోరంబోకు భూములు ప్రజల సాధారణ వినియోగానికి, ప్రభుత్వ అవసరాలకు కేటాయించినవని, వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్యాయంగా వినియోగించే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే సహించబోమని అధికార వర్గాలు స్పష్టంచేశాయి.
ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామస్థాయిలో భూసంబంధిత రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.













