రాయలసీమ న్యూస్, నంద్యాల:
RTGS AI 360 కెమెరాల సాయంతో ఏడాదిన్నర క్రితం మిస్సింగ్ అయిన యువతి గుర్తింపు
నంద్యాల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన RTGS AI 360 కెమెరాల సాంకేతిక పరిజ్ఞానంతో ఏడాదిన్నర క్రితం అదృశ్యమైన యువతిని బ్రాహ్మణకొట్కూరు పోలీసులు గుర్తించి, ఆమెను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఈ చర్యపై జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS బ్రాహ్మణకొట్కూరు పోలీసులను అభినందించారు.
బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతనకోట గ్రామానికి చెందిన యువతి ఏడాదిన్నర క్రితం అదృశ్యమైంది. ఈ ఘటనపై బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 39/25గా మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ మార్గదర్శకత్వంలో, నందికొట్కూరు రూరల్ సీఐ పర్యవేక్షణలో బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ చేపట్టారు.
దర్యాప్తు భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిన RTGS CCTV 360 సమగ్ర పర్యవేక్షణ, నిర్వహణ వ్యవస్థను వినియోగించారు. ఈ సాంకేతిక వ్యవస్థతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను కూడా ఉపయోగించి యువతి కదలికలను విశ్లేషించిన పోలీసులు, ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించగలిగారు.
యువతి ఆచూకీ లభ్యమైన వెంటనే, బ్రాహ్మణకొట్కూరు పోలీసులు ఆమెను సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసి, బ్రాహ్మణకొట్కూరు సబ్ ఇన్స్పెక్టర్ మణికంఠ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
యువతి సురక్షితంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. కేసును ఛేదించి, యువతిని క్షేమంగా తమకు అప్పగించిన పోలీసు అధికారుల సేవలను వారు అభినందించారు. పోలీసుల కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ, దర్యాప్తులో చూపిన పట్టుదలపై సంతోషం వ్యక్తం చేశారు.
మిస్సింగ్ కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా పోలీసు అధికారులు పేర్కొన్నారు. RTGS CCTV 360 వంటి ఆధునిక వ్యవస్థల వినియోగం వల్ల మిస్సింగ్ కేసులను వేగంగా, సమర్థవంతంగా ఛేదించడం సాధ్యమవుతోందని వారు అభిప్రాయపడ్డారు.
మిస్సింగ్ కేసును విజయవంతంగా చేదించిన బ్రాహ్మణకొట్కూరు సబ్ ఇన్స్పెక్టర్ మణికంఠను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ప్రత్యేకంగా అభినందించారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న ఆత్మకూరు డీఎస్పీ, నందికొట్కూరు రూరల్ సీఐ, బ్రాహ్మణకొట్కూరు పోలీస్ సిబ్బందిని కూడా ఎస్పీ ప్రశంసించినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల నుంచి సమాచారం అందింది.













