స్థల వివాదంపై వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

నందికొట్కూరులో కలకలం

నందికొట్కూరు:- కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే తమ స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ వృద్ధ దంపతులు నందికొట్కూరు పట్టణంలో ఆందోళనకు దిగారు. పురుగుల మందు, పెట్రోల్‌ బాటిల్‌ చేతబట్టి నిరసన వ్యక్తం చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

వృద్ధ దంపతుల కథనం ప్రకారం... నందికొట్కూరుకు చెందిన సుభద్రాబాయికి ఆరుగురు సంతానం ఉండగా, అందులో నలుగురు మరణించారు. 1982లో సుభద్రాబాయికి ప్రభుత్వం మూడు సెంట్ల స్థలాన్ని మంజూరు చేసింది. ఆమె సుమారు 18 సంవత్సరాల క్రితం మరణించగా, 2011లో కుమారుడు శేషారాంసింగ్‌ ఆ స్థలంపై తన పేరుతో పట్టా తీసుకున్నాడు. కుటుంబం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి వస్తూ ఉండేది.

శేషారాంసింగ్‌ చెల్లెలు లక్ష్మీబాయి అదే ప్రాంతంలో గుడిసెలో నివసిస్తున్నారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని మాజీ కౌన్సిలర్‌, టీడీపీ నాయకుడు అబ్దుల్లా, తన తండ్రి సన్నాహుల్లా పేరుపై ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని శేషారాంసింగ్‌ ఆరోపించారు. తన పేరుమీద ఉన్న స్థలాన్ని చెల్లెలి ద్వారా ఎలా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారనే అంశంపై ఆయన కోర్టును ఆశ్రయించారు.

శేషారాంసింగ్‌ దాఖలు చేసిన కేసుపై కోర్టు స్టే ఆర్డర్‌ జారీ చేయడంతో, సంబంధిత స్థలంలో స్టే ఉన్నట్లు బోర్డు ఏర్పాటు చేశారు. అయితే సన్నాహుల్లా ఆ బోర్డును రెండు సార్లు తొలగించినట్లు వృద్ధ దంపతులు తెలిపారు. కోర్టు కేసు నడుస్తుండగా బోర్డును ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించగా, తమను బెదిరించడంతో పాటు తీవ్ర దుర్భాషలాడినట్లు వారు ఆరోపించారు.

న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం శేషారాంసింగ్‌, ఆయన భార్య మీరాబాయి, చెల్లెలు తులసీబాయితో కలిసి పట్టణంలో నిరసన చేపట్టారు. పురుగుల మందు డబ్బా, పెట్రోల్‌ బాటిల్‌తో ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, వారి చేతిలోని పురుగుల మందు, పెట్రోల్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో మీరాబాయి తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాటిల్‌ను లాక్కొని ఆమెను అడ్డుకున్నారు. స్థల వివాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.