నంద్యాల పట్టణం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ బడులలోనే అనధికార దుకాణాలు నడుపుతున్నాయి. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, సమ దుస్తులు, బూట్లు, సంచులు, బెల్టులు తదితర వస్తువులను తప్పనిసరిగా పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులను కూడా బడులలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తల్లిదండ్రులు ఆక్షేపిస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 835 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో కర్నూలు జిల్లాలో 476, నంద్యాల జిల్లాలో 359 పాఠశాలలు పనిచేస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలల్లో సుమారు 1,90,863 మంది విద్యార్థులు చదువుకున్నారు. ప్రస్తుతం దాదాపు అన్ని పాఠశాలల్లోనూ పెన్సిల్‌ నుంచి దుస్తుల వరకు అన్నీ బడులలోనే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా ఒక టర్మ్‌ ఫీజు చెల్లించిన తర్వాతే ఈ సామగ్రిని కొనుగోలు చేయాలని యాజమాన్యాలు నిబంధనలు విధిస్తున్నాయి. బయట నుంచి దుస్తులు, పుస్తకాలు, బూట్లు తక్కువ ధరలకు దొరికినా వాటిని ఉపయోగించకుండా అడ్డుకుంటున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

పుస్తకాలు విక్రయించేందుకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రతి ఏడాది పునరుద్ధరించుకోవాలి. అయితే ఉమ్మడి జిల్లాలో ఏ పాఠశాలకూ ఇలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ చాలా పాఠశాలలు పుస్తకాల సంస్థల నుంచి 30 నుంచి 50 శాతం రాయితీతో పుస్తకాలు కొనుగోలు చేసి, వాటిని విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చిన్న పాఠశాలల నుంచి కార్పొరేట్‌ స్థాయి పాఠశాలల వరకు ప్రతి ఏడాది 10 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయి. జీవో నంబరు 1 ప్రకారం పాఠశాలలు ప్రారంభమయ్యే ముందు తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులతో కలిసి గవర్నింగ్‌ బాడీ ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి రుసుం పెంపు విషయాన్ని తెలియజేయాలి. వసతులు, సౌకర్యాల ఆధారంగా రుసుం పెంచుకోవాలనుకుంటే పాఠశాల కమిటీ సమావేశంలో తీర్మానం చేసి, కలెక్టర్‌, జేసీ, డీఈవోలకు పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే అమలు చేయాలి. అయితే ఈ విధానం చాలా చోట్ల పాటించడంలేదని తల్లిదండ్రులు అంటున్నారు.

గతేడాది ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 1,90,863 మంది విద్యార్థుల నుంచి చిన్న పాఠశాలల్లో సగటున ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ.25 వేల చొప్పున వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు ఫీజుల రూపంలో రూ.400 కోట్లకుపైగా వసూలవుతోంది. సమ దుస్తులు, పుస్తకాలు, బూట్లు తదితర సామగ్రి కోసం మరో రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు అంచనా. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు మరింత ఎక్కువగా ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

పుస్తకాల ధరలు కూడా పాఠశాలవారీగా భారీగా మారుతున్నాయి. ఎల్‌కేజీ విద్యార్థుల నుంచి సుమారు రూ.4 వేల వరకు, పదో తరగతి విద్యార్థుల నుంచి గరిష్ఠంగా రూ.20 వేల వరకు పుస్తకాల కోసం వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. సాధారణ పాఠశాలలతో పోలిస్తే కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో పుస్తకాలు 40 శాతం వరకు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఏ పుస్తకం ధర ఎంతన్నది స్పష్టం చేయకుండా, తరగతి వారీగా మొత్తం సెట్‌ ధరను మాత్రమే నిర్ణయిస్తున్నారు. అదే తరగతిలో ఐఐటీ ఫౌండేషన్‌, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ వంటి విభాగాల పేర్లతో వేర్వేరు ధరలు వసూలు చేస్తున్నారు. టెక్నో, స్మార్ట్‌, గ్లోబల్‌ వంటి పేర్లతో స్టడీ మెటీరియల్‌ చూపించి అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.