నంద్యాల జిల్లా, ఆగస్టు 11, 2026: నంద్యాల జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రత, శక్తి యాప్ ప్రయోజనాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో గల స్కూలులు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మహిళల భద్రత, శక్తి యాప్ ప్రయోజనాలు, కొత్త చట్టాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాణ్, IPS ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి యాప్ గురించి విద్యార్థినీ, విద్యార్థులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, ఇతరులు ఈ యాప్ ద్వారా పొందగలిగే రక్షణ, సహాయ సేవలపై స్పష్టమైన సమాచారం అందించారు. శక్తి యాప్‌కు సంబంధించిన వాట్సాప్ నంబర్ 7993485111ను కూడా విద్యార్థులకు తెలియజేశారు.

మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రొం సెక్సువల్ ఆఫెన్సెస్ (POCSO) చట్టం, బాల్యవివాహాల నిరోధం, బాలలపై నేరాలు, ఈవ్ - టీసింగ్ , సైబర్ నేరాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 112 లేదా 1098కు సమాచారం అందించాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం కోసం 100 లేదా 112 నంబర్లను సంప్రదించాలని, సైబర్ నేరాల విషయంలో 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు విద్యార్థులకు తెలిపారు.

అదేవిధంగా ఫేక్ కాల్స్, అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పంపినప్పుడు వాటిని ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు. అలాంటి లింకులు, ఫైల్స్ ద్వారా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని, బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత సమాచారం కోల్పోయి ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు విద్యార్థులకు వివరించారు.

జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళల భద్రత, సైబర్ సెక్యూరిటీ, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.