శ్రీశైలం: వరుసగా వచ్చిన సెలవులు, సోమవారం కావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శ్రీశైలం మహాక్షేత్రానికి తరలివచ్చారు.

తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో నిలబడి దర్శనాలు చేసుకుంటున్నారు. పెరిగిన రద్దీ కారణంగా ఆలయంలోని ఉచిత దర్శన క్యూ లైన్లు, 150 రూపాయల శీఘ్ర దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణ భక్తులందరికీ శ్రీ స్వామి, అమ్మవారి అలంకార దర్శనాలకు అనుమతి ఇచ్చారు. ప్రోటోకాల్ సిఫార్సులతో వచ్చే భక్తులకు మాత్రం రాత్రి 8.30 గంటలకు స్పర్శ దర్శనం కల్పించేలా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

వేకువజామున నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుత రద్దీ పరిస్థితుల్లో శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనం పూర్తయ్యేందుకు సగటున నాలుగు గంటల సమయం పడుతోంది.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందించేలా దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు, విశిష్టుల సిఫార్సులపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు.

సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తుల రద్దీతో శ్రీశైలం మహాక్షేత్రం సందడిగా మారి, ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో కిటకిటలాడుతున్నాయి.