శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపును దేవస్థానం అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో జరిగిన ఈ లెక్కింపులో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యమయ్యాయి.

శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి హుండీ లెక్కింపులో మొత్తం 4 కోట్ల 56 లక్షల 49 వేల 063 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గత 29 రోజుల కాలంలో శ్రీ స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించిన నగదు కానుకల రూపంలో ఈ ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు.

నగదుతో పాటు హుండీ లెక్కింపులో 79 గ్రాముల 600 మిల్లీ గ్రాముల బంగారం, 3 కేజీల 760 గ్రాముల వెండి లభించాయి. దేశీయ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించడం విశేషం.

విదేశీ కరెన్సీ వివరాల్లోగా యుఎస్ఏ డాలర్లు 823, యూఏఈ దిర్హమ్స్ 515, సింగపూర్ డాలర్లు 93, ఆస్ట్రేలియా డాలర్లు 50, కెనడా డాలర్లు 45, ఇంగ్లాండ్ పౌండ్స్ 10, సౌదీ రియాల్స్ 20, కువైట్ దినార్లు 5, ఒమాన్ రియాల్స్ 5 తదితర వివిధ దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు హుండీలోనుండి వెలికితీశారు.

హుండీ లెక్కింపును పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య పారదర్శకంగా నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. లెక్కింపు ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, సంబంధిత విభాగాల సమక్షంలో కొనసాగినట్లు సమాచారం.

ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. లెక్కింపు అనంతరం మొత్తం నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని దేవస్థానం నియమావళి ప్రకారం భద్రపరిచారు.